HomeరాజకీయాలుPawan Kalyan: అసెంబ్లీలో చర్చలు ప్రజల మనోభావాలను ప్రతిఫలించాలి

Pawan Kalyan: అసెంబ్లీలో చర్చలు ప్రజల మనోభావాలను ప్రతిఫలించాలి

Pawan Kalyan: ‘ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల ఆమోదం పొంది సభలో కొలువు తీరిన వారంతా శాసనాలు రూపొందించడానికే తప్ప ఉల్లంఘించడానికి కాదు. ఓ విధానం లేదా చట్టం మీద చర్చ సందర్భంగా విభేదించడం, వాదించడం, అర్ధవంతంగా దాన్ని ప్రజలకు అర్ధం అయ్యేలా చెప్పడం ఆమోదం పొందడం అనేవి ప్రజాస్వామానికి మౌలికమైన పునాదులు. విబేధించడం అంటే ద్వేషించడం కాదు… వాదించడం అంటే కొట్టుకోవడం కాదు… విభేదించడం, వాదించడం అనేవి చర్చను మరింత ఉన్నత దశకు తీసుకెళ్లేలా ఉండాల’ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.

వైసీపీ నాయకులు విజయాన్ని తీసుకున్నoత సులభంగా ఓటమిని తీసుకోలేకపోయారు.. అందుకే ప్రజా సమస్యలను పూర్తి స్థాయిలో చర్చించే శాసనసభకు రెండో రోజే హాజరు కాలేదన్నారు. ప్రజా సమస్యలు వినిపించేందుకు వేదిక అయిన గౌరవ శాసనసభను గత ప్రభుత్వం వ్యక్తిగత దూషణలు, బూతులతో అగౌరవపరిచింది. అందుకే ప్రజలు వాళ్లను 11 సీట్లకు పరిమితం చేశారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ 16వ శాసన సభాపతిగా నర్సీపట్నం ఎమ్మెల్యే శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను ప్రొటెం స్పీకర్‌ శ్రీ గోరంట్ల బుచ్చయ్యచౌదరి సభలో అధికారికంగా ప్రకటించారు. అనంతరం ఆయనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సభాపతి స్థానంలో కూర్చుండబెట్టారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తొలిసారి శాసన సభలో ప్రసంగించారు. ‘‘అయ్యన్న పాత్రుడు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. నర్సీపట్నం నియోజకవర్గం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి లోక్ సభ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. సాంకేతిక విద్య, రహదారులు-భవనాలు, అటవీ, పంచాయతీరాజ్‌ శాఖల మంత్రిగా గతంలో పనిచేశారు. పార్లమెంటులో ఉత్తరాంధ్ర గొంతు వినిపించారు. అలాంటి వ్యక్తి స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించడం చాలా ఆనందంగా ఉంది. ఇన్ని దశాబ్దాల్లో ఆయనలోని వాడి, వేడి, ఘాటైన వాగ్దాటిని ప్రజలు చూశారు. ఇకపై ఆయన హుందాతనాన్ని రాష్ట్ర ప్రజలంతా చూస్తారు.

భావంలో ఉండే తీవ్రత భాషలో ఉండాల్సిన అవసరం లేదు
గత ప్రభుత్వం వ్యక్తిగత దూషణలతో రాష్ట్ర పురోభివృద్ధిని ఆపేసింది. భాషా నియంత్రణ శాసన సభ నుంచే మొదలు కావాలి. గౌరవ స్పీకర్ ఆ బాధ్యతను తీసుకోవాలి. సభలో చిన్నా పెద్ద నాయకుడనే తేడా లేకుండా వ్యక్తిగత దూషణలు గత సభలో చూసి ప్రజలతో పాటు నాకు బాధేసింది. ముఖ్యంగా ఆడబిడ్డలు గత ప్రభుత్వ హయాంలో నలిగిపోయారు. ఏదైనా ప్రజా సమస్య మీద మాట్లాడితే సోషల్ మీడియాలో వ్యక్తిగత జీవితాలపై బురద జల్లే కార్యక్రమం జరిగేది. మీ హయాంలో అలాంటి చర్యలు ఆగిపోవాలి.

చర్చల్లో సంస్కారహీనమైన భాష, భావాలు ఉండకూడదని కోరుకుంటున్నాను. దాని నియంత్రణ సభ నుంచే మొదలవ్వాలి. భావంలో ఉండే తీవ్రత భాషలో ఉండాల్సిన అవసరం లేదు. భాష మనుషులను కలపడానికి తప్ప విడగొట్టడానికి కాదు. భాష సమస్యలను పరిష్కరించడానికి తప్ప విద్వేషాలు రేపడానికి కాదు. ఎంతటి జటిలమైన సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించ వచ్చు అని ఈ సభ నిరూపించాలి. భావాన్ని బలంగా తెలియజేయాలంటే దానిలో అసభ్యత లేకుండా మానవీయతతో ప్రజలందరికీ అర్ధం అయ్యేలా చెప్పాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లు ఈ సభ భవిష్యత్ కు ప్రమాణీకం కావాలి. రాష్ట్ర దిశ మార్చే వేదికగా మారాలి.

సభా సమయం రాష్ట్ర పురోభివృద్ధికి ఉపయోగపడాలి
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు మన ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుతోనే మొదలైంది. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి బలిదానంతో రాష్ట్రం ఆవిర్భవించింది. 56 రోజుల పాటు తిండితిప్పలు మానేసి ఆయన నరకం అనుభవించారు. ఆయన త్యాగాన్ని గుర్తుంచుకుంటూ సభను ప్రతీ నిమిషం రాష్ట్ర పురోభివృద్ధికి ఉపయోగపడేలా ఉపయోగించుకోవాలి. సభలో వాదోపవాదాలు హద్దులు దాటకుండా చూడాలి. ఎట్టి పరిస్థితుల్లో వ్యక్తిగత దూషణకు తావివ్వకూడదు.

గత ప్రభుత్వం మాదిరి తిట్లు, బూతులు, వ్యక్తిగత దూషణలకు పరిమితమైతే శ్రీ పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని అవమానించినట్లే. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తితో విలువలతో కూడిన సత్సంప్రదాయాలకు తెరలేపుతూ సభను నడుస్తుందని, ఈ విలువైన ఐదేళ్లు రాబోయే తరాలకు గొప్ప భవిష్యత్తును ఇచ్చేలా, అన్నం పెట్టే రైతులకు అండగా నిలిచేలా, మహిళలకు భద్రత కల్పించేలా, ప్రభుత్వ ఉద్యోగులకు భరోసానిచ్చేలా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాటలు వేసేలా ఉంటుందని ఆకాంక్షిస్తున్నాను’’ అన్నారు.
తన ప్రసంగంలో అయ్యన్నపాత్రుడు గారి ప్రసంగ శైలిని ఉద్దేశించి పవన్ సరదాగా చేసిన ఛలోక్తులు సభలో నవ్వులు పూయించాయి. ‘మీకు కోపం వస్తే రుషికొండను చెక్కినట్లుగా ఉత్తరాంధ్ర యాసలో పదునైన మాటలతో ప్రత్యర్థులకు గుండు కొట్టేస్తారు’ సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి.

Read also: Pawan Kalyan: పొల్యూషన్ ఆడిట్ కచ్చితంగా చేయాల్సిందే
Pawan Kalyan: పవన్ కల్యాణ్ దృష్టికి అసెంబ్లీ హౌస్ కీపింగ్ సిబ్బంది సమస్యలు
Ram Prasad Reddy: రోడ్డు ప్రమాదాలరహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతాం
Nara Lokesh: మెగా డీఎస్సీ విధి విధానాల ఫైలుపై మంత్రి లోకేష్ తొలి సంతకం
Kollu Ravindra: గనులు, ఎక్సైజ్ శాఖలు పూర్తి స్థాయిలో ప్రక్షాళన

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News