Gudivada Amarnath: సీఎం చంద్రబాబు గతంలో 14 ఏళ్లు పాలన చేసినా పోర్టులు, ఎయిర్ పోర్టులు, మెడికల్ కాలేజీలు ఎందుకు నిర్మించలేకపోయారని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ప్రశ్నించారు. విశాఖలో ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడారు. విశాఖకు రానున్న కాలంలో ఏం చేస్తారన్నది చెప్పాల్సిన బాధ్యత సీఎం చంద్రబాబుపై ఉందన్నారు.వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గత 5 ఏళ్ల పాలనలో ఈ ప్రాంతానికి అన్యాయం చేసిందన్నట్టు మాట్లాడటం సరికాదన్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు సంబంధించి 2019లో వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి 2,200 ఎకరాల్లో ఎయిర్ పోర్టు ప్రతిపాదిత స్థలం కాగా, ప్రభుత్వం చేతిలో ఉన్నది అందులో కేవలం 377 ఎకరాలేనన్నారు.
కానీ 2019 ఫిబ్రవరి 14వ తేదీన ఓ శిలాఫలకం వేసి ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నించారని, ఆ తర్వాత ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. ఇప్పటికీ ఆయన చేసిన కార్యక్రమంగా చిత్రీకరించడం ఆశ్చర్యానికి గురి చేస్తోందన్నారు. గతేడాది మే 3న భోగాపురం ఎయిర్ పోర్టుకు సంబంధించి ఆరోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి గారు, ఐటీ మంత్రిగా ఉన్న తాను, కేంద్ర మంత్రిగా ఉన్న జ్యోతిరాదిత్య సింథియా కలిసి పూర్తి స్థాయిలో అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత నిర్మాణానికి పనులు మొదలు పెట్టామని గుర్తు చేశారు. నేటికి దాదాపు 35 శాతం పనులు పూర్తి చేశామన్నారు.
రన్ వే, టర్మినల్ భవనాల పనులు జరుగుతున్న క్రమంలో.. ఏమీ చేయకుండా అన్నీ నేనే చేశానని చెప్పుకునే వారిలో చంద్రబాబుకు మించిన వ్యక్తి లేరని విమర్శించారు. చంద్రబాబుకు ఉన్న మార్కెటింగ్ స్కిల్స్ దేశంలోనే ఎవరికీ ఉండవన్నారు. మేం చేసిన పనులు, కార్యక్రమాలను కూడా ఆయనే చేసినట్టు ప్రజలకు చిత్రీకరించే ప్రయత్నం చేయడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. ప్రతిదీ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఉంటుందన్నారు.
2,200 ఎకరాలకు గానూ కేవలం 377 ఎకరాలు మాత్రమే ప్రభుత్వం దగ్గర ఉంటే మిగతాది రైతుల నుంచి సేకరించి, అనేక రకాల కేసులు ఉంటే వాటిని ఎదుర్కొని, వ్యవసాయ భూమి కలిగిన రైతులకు కాస్త ఎక్కువ ధర చెల్లించే కార్యక్రమం చేసినది ఆరోజు జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమన్నారు. కొంత మంది నివాసం ఉంటున్న గ్రామాలను ఖాళీ చేయాల్సి వస్తే పోలిపల్లి, గుడిపవలస గ్రామాలకు ఆ కుటుంబాలను తరలించి రూ.80 కోట్లు ఖర్చు పెట్టిల అన్ని రకాల సౌకర్యాలతో ఇల్లు కట్టించామని గుర్తు చేశారు.
ఎన్జీటీలో కేసులు వేస్తే దాన్నీ అధిగమించామన్నారు. అన్ని రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొని భూములను సేకరించి జీఎంఆర్ సంస్థకు అప్పగించామన్నారు. ఇండియా ఫర్ సోవరెన్ సర్వీసెస్, ఎయిర్ నావిగేషన్ సర్వీసెస్ కు సంబంధించి ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీ సర్వీసెస్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సేఫ్టీల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు తీసుకొచ్చామన్నారు. సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ నుంచి, ఎన్వైన్‌మెంటల్ క్లియరెన్స్.. ఇలా అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో తీసుకుని నిర్మాణం చేపట్టామన్నారు.
దాదాపు 350 యంత్రాలతో పనులు చేపట్టి మీడియాకు చూపించామన్నారు. టర్మినల్ బిల్లింగులకు సంబంధించిన నిర్మాణాలు అందరూ చూశారన్నారు. చంద్రబాబు గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, మెడికల్ కాలేజీల నిర్మాణం గురించి ఎప్పుడైనా ఆలోచన చేశారా?అని ప్రశ్నించారు. ఇప్పుడు మా హయాంలో పనులు చేస్తే మీరు పేర్లు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.
మేం చేసిన పనులను కొనసాగిస్తామని చెప్పాలని, గత ప్రభుత్వంలో ఈ మేరకు పనులు జరిగాయని చెప్పాలన్నారు. ఓ వైపు భోగాపురం ఎయిర్ పోర్టు పనులు కొనసాగుతుండగా 100 కిలోమీటర్ల పరిధిలో ఉన్న మూలపేటలో ఎయిర్ పోర్టు కడతామని ప్రకటించారన్నారు. అక్కడ పోర్టు కట్టడం 45 శాతం పూర్తి అయ్యిందన్నారు. అక్కడ ఎయిర్ పోర్టు కూడా కట్టడం మంచిదేనని, స్వాగతిస్తున్నామన్నారు. కుప్పంలో, మూలపేటలో, నాగార్జున సాగర్ లో, దొనకొండలో, దగదర్తిలో ఒక ఎయిర్ పోర్టు కడతామన్నారని.. కడితే మంచిదేనని, స్వాగతిస్తున్నామన్నారు. 1995లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తానని చెబుతూనే వస్తున్నారన్నారు.
ఏ ప్రభుత్వానికైనా 6 నెలలు సమయం ఇవ్వాలన్నది తమ పార్టీ అభిప్రాయమని, కానీ దానికి చంద్రబాబు సమయం ఇవ్వడం లేదన్నారు. బీపీసీఎల్ కు సంబంధించి మీడియాలో విపరీతమైన ప్రచారం చేశారన్నారు. ఎన్నికలకు ముందే బీపీసీఎల రిఫైనరీ టీమ్ వచ్చిందన్నారు. అధికారులను అడిగితే ఈ విషయం తెలుస్తుందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాతే వాళ్లు పరుగెత్తుకుని వచ్చారని ప్రచారం చేసుకున్నారన్నారు.
పరిశ్రమల స్థాపనకు సంబంధించి ఏదీ ఫైనల్ అయ్యే వరకు, పెట్టుబడి పెడతారని నిర్ధారణకు వచ్చే వరకు, మన వద్ద అన్ని రకాలుగా భూములు, అనుమతులు అన్నీ ఇచ్చే వరకు ప్రకటన చేయవద్దని ఆరోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి గారు తమకు చెప్పేవారని గుర్తు చేశారు. చెప్పిన తర్వాత పరిశ్రమ రాకపోతే మాట తప్పిన వారమవుతామన్నారు.
ప్రజలు మీకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు కాబట్టి ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. అమలు చేసేదాకా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని స్పష్టం చేశారు. నిన్నగాక మొన్న జీవో నంబర్ 29 రిలీజ్ చేశారన్నారు. మా హయాంలో అమ్మ ఒడి అనేది ప్రతిష్టాత్మకంగా అమలు చేశామన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు చాలా ప్రచార సభల్లో సూపర్ సిక్స్ ను ప్రజలకు పదే పదే చెప్పారన్నారు. తల్లికి మాత్రమే రూ.15 వేలు ఇస్తున్నారని, కానీ మేం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ జీవోఇచ్చిన తర్వాత కొన్ని అనుమానాలు కలుగుతున్నాయన్నారు.
జీవోలో పిల్లలను బడులకు పంపే తల్లులకు రూ.15 వేలు అని పేర్కొన్నారన్నారు. ఇక్కడే ప్రజలకు అనేక అనుమానాలు కలుగుతున్నాయన్నారు. గడచిన 5 ఏళ్లుగా అమ్మ ఒడి అందుకుంటున్న వారిలో ఆందోళన ఉందన్నారు. కానీ ఈ అనుమానాలపై సీఎం చంద్రబాబు నోరెత్తడం లేదన్నారు.
ఇప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న రామానాయుడు గతంలో ప్రచారం సందర్భంగా మహిళలతో మాట్లాడుతూ ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ రూ.15 వేలు, రూ.15 వేలు… అంటూ చెప్పిన వీడియోను ఈ సందర్భంగా గుడివాడ అమర్ నాథ్ మీడియాకు చూపించారు. అవసరమైతే ఇప్పుడు ఎంత మంది పిల్లలను అయినా కనండి.. అంత మందికీ రూ.15 వేలు ఇస్తామని గతంలో చంద్రబాబు మాట్లాడారని గుర్తు చేశారు.
ఇవీ చదవండి: Varudhu Kalyani: మహిళలకు ఇచ్చిన హామీల అమలు ఎప్పుడు? : వరుదు కళ్యాణి ప్రశ్న
CM Revanth with Modi: ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..
Cinema Producers: ఏపీ ఉపముఖ్యమంత్రితో సినిమా పెద్దల భేటీ
Pawan Kalyan: అసెంబ్లీలో చర్చలు ప్రజల మనోభావాలను ప్రతిఫలించాలి