HomePawan Kalyan: ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. సమీక్షలతో బిజీ బిజీ...

Pawan Kalyan: ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. సమీక్షలతో బిజీ బిజీ…

Pawan Kalyan: బాధ్యతలు చేపట్టిన వెంటనే ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పలు సమీక్షలతో బిజీ బిజీగా గడిపారు. ఒక దాని తర్వాత మరొకటి… తన శాఖల పని తీరును వినమ్రంగా, వివరంగా అధికారులను అడిగి తెలుసుకుంటూ, శాఖల స్వరూపం, వాటి పనితీరును అర్థం చేసుకుంటూ పవన్ కళ్యాణ్ సమీక్షలు కొనసాగాయి. శాఖాపరమైన సమీక్షలు అంటే గణాంకాలు వినడం, శాఖలపై లక్ష్యాలను నిర్దేశించి మళ్లీ కలుద్దాం అని చెప్పడం కాకుండా, కాస్త సమయం ఎక్కువ తీసుకుంటూనే శాఖల సమగ్ర పని తీరు మీద ఆయన దృష్టి సారించారు.

ఆయనకు కేటాయించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల పని తీరును పూర్తి స్థాయిలో తెలుసుకున్నారు. రోజుకు 10 గంటల చొప్పున సమీక్షలు, అధికారులతో సమావేశాలు నిర్వహించారు. స్థానిక సంస్థల పాలన, మౌలిక వసతుల కల్పన, అటవీ సంరక్షణ, పర్యావరణ పరిరక్షణపై ఆలోచనలను వెల్లడించారు.

క్షేత్రస్థాయిలో ప్రజలకు శాఖాపరంగా అందుతున్న ప్రయోజనాలు, ఆయా శాఖల్లోని అసలు వాస్తవాలను లోతుగా వెళ్లి సమీక్ష చేయడంతో పవన్ కళ్యాణ్ కృతకృత్యులయ్యారు. రెండు రోజుల్లో సుమారు 20 గంటల పాటు ఏకధాటిగా ఆయన సమీక్షలు చేస్తూ అన్ని శాఖలపై పట్టు సాధించే దిశగా తొలి అడుగులు దిగ్విజయంగా వేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా, శాస్ర్త, సాంకేతిక శాఖల కీలక బాధ్యతలు తీసుకున్నపవన్ కళ్యాణ్.. బాధ్యతలు తీసుకున్న నిమిషం నుంచే శాఖల పనితీరుపై దృష్టి సారించారు. శాఖల పనితీరును, క్షేత్రస్థాయిలోని వాస్తవాలను ఆసాంతం వింటూ వాటిలోని సందేహాలను అడిగి తెలుసుకుంటున్నారు. తనకు స్వతహాగా తెలిసిన అంశాలను అధికారుల వద్ద ప్రస్తావిస్తూ శాఖల్లోని విషయాలను లోతుగా అధ్యయనం చేస్తున్నారు.

రక్షిత మంచి నీరు… రహదారి కల్పన
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు. రక్షిత మంచి నీటి సరఫరా చేయడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ కుళాయి వేయించి నీటిని సరఫరా చేయడం కోసం లక్ష్యాన్ని నిర్దేశించుకొని పని చేయాలని స్పష్టంగా చెప్పారు. అన్ని గ్రామ పంచాయతీలకు రోడ్డు అనుసంధానం మెరుగుపడాలని, ఇందుకు సంబంధించిన ప్రణాళికతో రావాలని ఆదేశించారు.

సీనియర్ ఐఏఎస్ అధికారులు, గ్రూప్ 1, 2 అధికారులను గౌరవిస్తూ శాఖల్లో తనకు తెలియని విషయాలు ఉంటే, తన దృష్టికి తీసుకురావాలని దానికి అనుగుణంగానే ముందుకు వెళ్దామని చెబుతున్నారు. దాదాపు శాఖల్లోని అన్ని విషయాల మీద అధికారులు చేస్తున్న ప్రజెంటేషన్ ను ఆసక్తిగా పరిశీలించారు. తన సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. దీంతో శాఖలపై చాలా కాలం తర్వాత సమీక్షలు సంతృప్తిగా సాగాయని భావన వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు, వాటి అమలు తీరు, గ్రామీణ వ్యవస్థ ప్రస్తుత పరిస్థితిని కూలంకషంగా సమీక్ష చేస్తున్నారు. గురువారం ఉదయం గ్రామీణాభివృద్ధి శాఖలో మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సోషల్ ఆడిట్ తీరు, క్షేత్రస్థాయిలో సోషల్ ఆడిట్ పరిస్థితిని పవన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకాన్ని మరింత విస్తృతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. ఉపాధి హామీ పథకం పకడ్భందీగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

పంచాయతీల్లో ఉపాధి హామీ సోషల్ ఆడిట్ సభల నిర్వహణ ప్రొటోకాల్ అనుసరించి జరిగేలా చూడాలని చెప్పారు. సోషల్ ఆడిట్ వివరాలను పక్కాగా నమోదు చేయాలని, అప్పుడే సభల నిర్వహణ పక్కగా ఉంటుందని చెప్పారు. మొదటిరోజు సమీక్షలో భాగంగా పంచాయతీ రాజ్ అధికారులతో సమావేశం సందర్భంగా గ్రామ పంచాయతీలకు రావాల్సిన సీనరేజ్ ఛార్జీలు, వాటి వసూళ్ల తీరుపై ఆరా తీశారు. ఏ మేరకు వసూలు అవుతున్నాయో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆర్థిక సంఘం నిధులు స్థానిక సంస్థలకు పూర్తిస్థాయిలో దక్కేలా అధికారుల పనితీరు ఉండాలని, ఆ నిధులు ఎలా ఖర్చు అవుతున్నాయో కూడా పర్యవేక్షణ పక్కగా జరపాలని సూచిస్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలోని పంచాయతీల ఆర్థిక పరిస్థితి, అక్కడ నిర్వహించాల్సిన అభివృద్ధి పనులు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఎంత మేర పెండింగ్ ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. అవసరం అయితే నిధుల విడుదలకు సంబంధించి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో మాట్లాడదామని అధికారులకు చెప్పారు. గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేకమైన ప్రణాళిక రూపొందించాలని సూచించారు. మేజర్, మైనర్ పంచాయతీల్లో ప్రాధాన్యత అంశాలను మొదటగా గుర్తించి వాటిపై పనిచేద్దామని చెప్పారు. ఎప్పటికప్పుడు సర్పంచులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో అధికారులు సమావేశమయితే అసలు వాస్తవాలు తెలుస్తాయని ఈ దిశగా ఆలోచన చేయాలని చెప్పారు.

గతంలో పవన్ కళ్యాణ్ సర్పంచుల సమావేశంలో అలాగే గ్రామాల అభివృద్ధిపై జరిగిన పలు సమావేశాల్లో ఆయన దృష్టికి వచ్చిన విషయాలను అధికారులను స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. అధికారులు చెబుతున్న అన్ని విషయాలను వింటూ.. వాటిని ప్రత్యేకంగా నోట్ చేసుకుంటున్నారు. సచివాలయాలపై గ్రామ సర్పంచులకు ఆజమాయిషి లేని విషయాలను, సచివాలయ వ్యవస్థ రాజ్యాంగబద్ధంగా ఉందా..? అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీల్లో వీధి దీపాలు లేకపోవడం, పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారడానికి గల కారణం, గ్రామీణులకు రక్షిత మంచినీరు పూర్తిస్థాయిలో అందించేందుకు ముందున్న దారులు వెతకాలని, దీనిపై నివేదికలు సిద్ధం చేసి తన ముందు ఉంచాలని పవన్ శాఖాధిపతులకు చెప్పారు. నివేదికలు సిద్ధమైన తరువాత వాటి అమలుకు ఎలాంటి ప్రణాళికతో పనిచేయాలి అనేది నిర్ణయిద్దామని సూచించారు.

కీలకమైన అటవీశాఖపై సమీక్ష సందర్భంగా పవన్ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం ఎంత? పెంపుదలకు అటవీ శాఖ చేసిన ప్రయత్నం ఎంత? ఎందుకు రాష్ట్రంలో అడవులు క్రమంగా క్షీణిస్తున్నాయన్న విషయాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా తుపాన్ల నుంచి తీరాన్ని రక్షించే మడ అడవులు ధ్వంసం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. వాటి సంరక్షణకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మడ అడవులు ధ్వంసం చేసే వారు ఎవరైనా సరే ఉపేక్షించవద్దని సూచించారు. తీర ప్రాంతాల్లో మడ అడవుల రక్షణ, పెంపుదలకు కట్టుబడి పనిచేయాలని వాటి కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలు రూపొందించాలని చెప్పారు. అటవీ సంపద పరిరక్షణ కోసం ప్రత్యేకంగా రూట్ మ్యాప్ రూపొందించాలని ఆ శాఖ అధికారులకు ప్రత్యేకంగా చెప్పారు. పర్యావరణ సంబంధిత అంశాలపై సంగ్రంగా చర్చించారు.

Read also:Yoga: ఆరోగ్య భాగ్యానికి సులువైన మార్గం.. యోగా
Yoga: ఆరోగ్య భాగ్యానికి సులువైన మార్గం.. యోగా
CS Neerabh Kumar Prasad: వచ్చే నెల 1 నుంచి ఆగస్టు 31 వరకు డయేరియా నియంత్రణపై ప్రచారం
NMD Farook: న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా ఎన్ఎండీ ఫరూఖ్ బాధ్యతలు
Ajay Jain: ఏపీలో రబీ కరువుపై కేంద్రానికి నివేదిక

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News