Gangs Of Godavari Review: యువ కథానాయకుడు విష్వక్‌సేన్ నటించిన తాజా చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఇవాళ థియేటర్లలోకి వచ్చింది. మాస్ గెటప్‌లో విష్వక్ సేన్ మెరిపించాడా? గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రేక్షకులను ఆకట్టుకుందా? సినిమా రివ్యూ చూద్దాం.
నటీ నటులు: విష్వక్‌సేన్, అంజలి, నేహాశెట్టి, నాజర్, పి.సాయికుమార్, హైపర్ ఆది, పమ్మిసాయి, మధునందన్, ప్రవీణ్, గోపరాజు రమణ, పృథ్వీరాజ్, మయాంక్ పరాఖ్, ఆయేషా ఖాన్ తదితరులు
ఫొటోగ్రఫీ : అనిత్ మదాడి
మ్యూజిక్ : యువన్ శంకర్ రాజా
కూర్పు: నవీన్ నూలి
కళ: గాంధీ నడికుడికర్
నిర్మాణం: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య, రచన
డైరెక్టర్ : కృష్ణచైతన్య
నిర్మాణ సంస్థ: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్
రిలీజ్: మే 31, 2024
కొంత కాలంగా థియేటర్లలో స్తబ్దత నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తాజాగా ఈ వారం మూడు చిత్రాలు విడుదలయ్యాయి. వీటిలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం కూడా ఒకటి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి వచ్చిన చిత్రం కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. విష్వక్‌సేన్ (Vishwak sen) హీరోగా, రచయిత కృష్ణచైతన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం రివ్యూ (Gangs Of Godavari Review) చూద్దాం.
కథేమిటి?
జీవితంలో పైకి ఎదగడం మన రైట్ అని నమ్మిన ఓ యువకుడే లంకల రత్నాకర్ (విష్వక్ సేన్). నాన్న చెప్పిన ఆ బాటను చిన్నప్పుడే బాగా మదింపు చేసుకున్నాడు. తనలోని మనిషిని పక్కనపెట్టి, ఎదుటివాళ్లని వాడుకోవడమే ఎజెండాగా పెట్టుకుంటాడు. చిన్నచిన్న దొంగతనాలు చేస్తూ వచ్చిన రత్నాకర్.. లోకల్ ఎమ్మెల్యే దొరసామి (గోపరాజు రమణ)కి కుడిభుజంగా ఎదుగుతాడు. దొరసామి, నానాజీల మధ్య నడుస్తున్న రాజకీయ వైరంలో కూడా భాగం అవుతాడు. ఆ రాజకీయం అతన్ని ఎందాకా తీసుకెళ్లింది? రత్నాకర్ కోరుకున్నట్టు ఎదిగాడా? లంకల్లోని పగ అతన్ని ఎలా వెంబడించింది? బుజ్జి (నేహాశెట్టి), రత్నమాల (అంజలి)తో అతడికి సంబంధం ఎలా తగులుతుంది? తదితర విశేషాల సమాహారమే సినిమా కథ.
ఎలా ఉందంటే?
పచ్చటి పల్లె సీమలు, ప్రశాంతమైన వాతావరణం ఈ చిత్రంలో చూపించారు. చాలా సినిమాల్లో పచ్చదనంతో కూడిన పల్లెల్లో సీన్లు చిత్రీకరించినప్పటికీ ఈ కథ కాస్త భిన్నంగా సాగుతుంది. కృష్ణచైతన్య ఎరుపెక్కిన గోదావరిని ఈ మూవీలో తెరకెక్కించారు. (Telugu Movie Review). అక్కడి రాజకీయాలు, ఆధిపత్య పోరు, లంక గ్రామాల్లోని ప్రతీకారాలతో ఓ యువకుడి గమనాన్ని ముడిపెట్టారు. కథలో రంగస్థలం ఛాయలు కనిపిస్తాయి. ప్రతీ పాత్రకీ దానిదైన ఓ ప్రయాణంతో కథను రచయిత రాసుకొచ్చారు.
సినిమాలో హీరో, అంజలి పాత్రలే ప్రముఖంగా ప్రభావం చూపాయి. భావోద్వేగాలను రక్తికట్టించే ప్రయత్నం చేశారు. అయితే, కొన్ని సన్నివేశాలు లాగ్ ఎక్కువ కావడం ప్రేక్షకులను నిరాశపరుస్తుంది. విలన్ పాత్రలో పస లేకపోవడం మైనస్. రాధిక అక్కగా ఫేమస్ అయిన నేహాశెట్టి పాత్ర కూడా పరిమితంగానే ఉండటం కూడా మైనస్. చాలా సన్నివేశాల్లో భావోద్వేగాలు పండలేదు (Movie Review). అయితే, విజువల్స్ కట్టిపడేసేలా ఉంటాయి. మంచి సంగీతం ప్లస్ అయ్యింది. పొలిటికల్ గేమ్‌లో హీరో వేసే ఎత్తులు, పై ఎత్తులు ఇంకాస్త బాగా తీస్తే బాగుండేది. ఇంత గాఢమైన కథని, నేపథ్యాన్ని ఆవిష్కరిస్తున్నపుడు విలన్ పాత్రను మరీ పేలవంగా చూపడం కథకు మైనస్ గా నిలుస్తోంది.
గోదావరి పరిధిలోని లంక గ్రామాల్లో పగ, ప్రతీకారాల సన్నివేశాలను దర్శకుడు చాలా వేగంగా కథలోకి తీసుకెళ్లాడు. (Gangs Of Godavari Review Telugu). విష్వక్‌సేన్‌ను మాస్ గెటప్ ఆవిష్కరించిన విధానం, ఫైట్స్, హీరోయిన్ అంజలి పాత్ర ఫస్ట్ హాఫ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హీరో గెటప్‌లో మాస్ కోణం, అతని వ్యక్తిత్వం వరకూ బ్రహ్మాండగానే ఉంది. అయితే, హీరో పాత్ర ఎదుగుతున్న క్రమం చిత్రీకరణ బాగోలేదు. కాస్త సినిమాటిక్, లాగ్ అనిపిస్తుంది. శాసనసభ్యుడిని కిడ్నాప్ చేయడం, మరో ఎమ్మెల్యేని చంపి నదిలోకి పారేయడం లాంటి సన్నివేశాలే ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. సెకండ్ ఆఫ్‌లో నదిలో సీన్ మెప్పిస్తుంది. చివర్లో తండ్రీ, కుమార్తెల బంధం నేపథ్యంలో ఎమోషన్స్‌ను రక్తికట్టించే ప్రయత్నం నప్పలేదు.
పాత్రలకు న్యాయం చేశారా?
రత్నాకర్‌గా విష్వక్‌సేన్ (Vishwak sen) ఫర్వాలేదనిపించాడు. మాస్ కోణానికి మరింత పదును పెట్టినట్లయింది. క్యారెక్టర్‌కు తగ్గట్టుగానే యాక్టివ్‌గా నటించాడు విష్వక్‌సేన్. ఫైట్, సాంగ్స్ పై బాగా ప్రభావం చూపించాడు హీరో. అంజలి పాత్ర మెప్పించింది. నేహాశెట్టి బ్యూటిఫుల్‌గా కనిపించింది. కానీ ఆ పాత్ర జర్నీలోనే సమస్యలున్నాయి. నాజర్, గోపరాజు రమణ, సాయికుమార్, ప్రవీణ్, పమ్మి సాయి, హైపర్ ఆది తదితరులు ఫర్వాలేదనిపించారు. ఈ చిత్రానికి టెక్నికల్ యూనిట్ బాగా బలంగా పని చేసింది. కెమెరా డిపార్ట్‌మెంట్ బెటర్‌గా పని చేసినట్లు స్పష్టమవుతోంది. యువన్ శంకర్ రాజా బాణీలు చిత్రానికి బలంగా నిలిచాయి. కళ, కూర్పు విభాగాల పనితీరు బాగానే ఉంది. రచయితగా కృష్ణచైతన్య మార్క్ ఈ చిత్రంపై కనిపించింది. సీను తర్వాత సీను తర్వాత ఏం జరుగుతుందన్నది ఆసక్తి పెంచే విధంగా తీసి ఉంటే బాగుండేది. నిర్మాణం సైతం క్వాలిటీగా ఉంది.
ఫైనల్ టచ్: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. ఒకసారి ఈదేయొచ్చు.
ఇవీ చదవండి: Balakrishna: బాలకృష్ణ అంజలిని తోసేయడంపై హీరో, నిర్మాత క్లారిటీ
Telangana: తుది దశకు తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన
NTR: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి
Rains: కేరళ పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు