Ajay Jain: ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో పలు మార్పులకు ఇప్పటికే రంగం సిద్ధమైంది. తాజాగా రాష్ట్రంలో రబీ కరువు పరిస్థితులను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన కేంద్రబృందాన్ని… సాయం అందించే విషయంలో ఉదారంగా స్పందించాలని రాష్ట్ర విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి అజయ్ జైన్ విన్నవించారు. విజయవాడలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో ఆయన కేంద్ర కరువు బృందంతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులను వివరించారు. గత ఏడాది రాష్ట్రంలో కరువు మండలాలను సైతం గత ప్రభుత్వం ప్రకటించింది.
నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, ప్రకాశం జిల్లాల్లోని కరువు ప్రభావిత మండలాల్లో నాలుగు రోజులుగా పర్యటించిన కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) సీఈఓ, రైతు సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ శ్రీ రితేష్ చౌహాన్ నేతృత్వంలోని సభ్యులు శ్రీ డా.పొన్నుస్వామి, శ్రీ సునీలే దుబే, శ్రీ చిన్మయ్ పుండ్లికరావు గోత్కరే, శ్రీ ఆశిష్ పాండే, శ్రీ అరవింద్ కుమార్ సోని, శ్రీ మన్నూజీ ఉపాధ్యాయ్, శ్రీ ఎస్ సి కశ్యప్, శ్రీ మదన్ మోహన్ మౌర్య, శ్రీ అనురాధ బట్నా ఈ మేరకు స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, ఎండి రోణంకి కూర్మనాథ్, ఇతర అధికారులతో భేటీయై చర్చించారు.
అజయ్ జైన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరువు పరిస్థితులను కేంద్ర బృందానికి వివరించారు. ఆరు జిల్లాల్లో 63 తీవ్ర కరువు మండలాలు, 24 మధ్యస్థ కరువు మండలాలుగా ప్రకటించినట్లు తెలిపారు. సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం, వర్షాభావంతో అత్యధిక డ్రైస్పెల్స్, రిమోట్ సెన్సింగ్, సాయిల్ మోయిశ్చర్, హైడ్రాలజీ, పంట నష్టం 33% అంతకంటే ఎక్కువ ఉన్న మండలాలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం కరువు ప్రాంతాలను ప్రకటించిందని అన్నారు. క్షేత్రస్థాయిలో కరువు నష్టానికి సంబంధించి వాస్తవిక వివరాలను అందించామని, రైతులను ఆదుకోడానికి సత్వరమే రూ.319.77 కోట్లు సాయం చేయాలని కోరారు. అలాగే, ఉపాధిహమీ పథకం క్రింద అదనంగా మరో 50 పనిరోజులు కల్పించాలని కేంద్ర బృందానికి అజయ్ జైన్ విజ్ఞప్తి చేశారు.
కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) సీఈఓ, రైతు సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ రితేష్ చౌహాన్ మాట్లాడుతూ.. కరువు కారణంగా నష్టపోయిన పంటల వివరాలను కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపుతామని వెల్లడించారు. పంట నష్టం జరిగిన రైతులను అన్ని విధాలా ఆదుకునేలా చూస్తామన్నారు. జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ కరువు పరిస్థితుల వాస్తవికతను తెలియజేశాయని, అదేవిధంగా క్షేత్రస్థాయిలో రైతులు కరువు వల్ల జరిగిన నష్టాన్ని వివరించారని చెప్పారు. త్వరగా కమిటీ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించి వీలైనంత మేర ఆదుకోవడానికి తమవంతు సహకారాన్ని అందిస్తామని రితేష్ చౌహాన్ స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: RSS: ప్రధాని మోదీకి RSS చీఫ్ స్పష్టమైన సందేశం.. అహంకారం వీడండి..
Devotional: శివయ్య ప్రార్థన చేస్తున్నారా? భక్తితో గమనించండి
CBN at Polavaram: చంద్రబాబు పోలవరం పర్యటన.. టార్గెట్ జగన్!
Muddada Ravichandra: సీఎం ముఖ్యకార్యదర్శిగా ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు
Chandrababu: కనక దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు